telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

భాగ్యనగరంలో ఘనంగా లాల్‌దర్వాజ బోనాలు

భాగ్యనగరంలో బోనాలు సంబరాలు ఈ రోజుతో ముగిసాయి. నగర సంప్రదాయంలో మమేకమైన బోనాల ఉత్సవాలు ఆదివారం పాతనగరంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో కనులపండువగా జరిగాయి. పాతబస్తీ లాల్‌దర్వాజలో కొలువైన సింహవాహిని మహంకాళి దేవాలయంతోపాటు అక్కన్న మాదన్న, గౌలిపుర భరత్‌మాత, గౌలిగూడ, మీరాలంమండి ఆలయాలు భక్తజనసంద్రమయ్యాయి. అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు, యువతుల కోలాటాలు ప్రత్యేకార్షణగా నిలిచాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్‌అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని పట్టువస్ర్తాలు సమర్పించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరగగా, ఆలయాల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయతోపాటు పలువురు ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

పాతబస్తీలో ప్రఖ్యాతిగాంచిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రాక, మధ్యాహ్నానికి ఊపందుకున్నది. బోనాల సమర్పణ, దర్శనం, ఇతర ప్రముఖులు విచ్చేసేందుకు ప్రత్యేక వరుసలు ఏర్పాటు చేశారు. తీరొక్క పూలు, విభిన్న అలంకరణ, రంగురంగుల విద్యుద్దీపాలతో అమ్మవారి ఆలయం అలరారింది. శక్తి స్వరూపిణిగా కొలిచే అమ్మవారి దర్శనం కోసంవేలాదిమంది బారులు తీరారు. సోమవారం జరిగే ఘటాల ఊరేగింపునకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ప్రశాంత జీవితం గడిపేలా దీవించమని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. సీపీ అంజనీకుమార్‌, అదనపు సీసీ చౌహాన్‌, షీటీమ్స్‌ అదనపు కమిషనర్‌ షీకా గోయల్‌, దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ బందోబస్తును పర్యవేక్షించారు.

Related posts