telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ వన్డే సిరీస్ : .. రెండో వన్డేలో … భారత్‌ ఘన విజయం …

india won on 2nd odi with westindies

భారత్‌, వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. 59 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. దీంతో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. దీంతో టీమ్‌ ఇండియా భారీ స్కోరు సాధించింది. 280 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. మధ్యలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి 270 పరుగులు నిర్దేశించారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో లూయిస్‌, పూరన్‌లు మాత్రమే రాణించారు. లూయిస్‌ 65 పరుగులు చేయగా.. పూరన్‌ 42 పరుగులు చేశాడు. మిగిలిన వారెవ్వరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షమి, కుల్దీప్‌ తలో రెండు వికెట్లు తీశారు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దుకాగా.. రెండో వన్డేలో భారత్‌ గెలిచింది. ఇక మూడో వన్డే ఈనెల 14న జరుగనుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ శిఖర్ ధవన్ కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.

రోహిత్‌ శర్మ కూడా 18 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పంత్‌ కూడా ఎక్కువసేపు నిలువలేదు. 20 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ తన 42వ సెంచరీ నమోదు చేశాడు. జాదవ్‌, భువనేశ్వర్‌ తక్కువ పరుగులకే ఔటయ్యారు. రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్న కోహ్లీ.. వీరవిహారం చేశాడు. టాపార్డర్‌ పెద్దగా ఆకట్టులోకేపోయినా మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి చెలరేగాడు. వన్డే చరిత్రలో తన 42వ సెంచరీ సాధించాడు. వన్డేల్లో భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలువడంతోపాటు.. విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వన్డేల్లో భారత్‌ తరపున 11, 406 రన్స్‌ చేసి అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్‌మన్‌ జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న.. గంగూలీని వెనక్కినెట్టి.. కోహ్లీ ద్వితీయ స్థానానికి చేరాడు. ఇక వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా పాక్‌ క్రికెటర్‌ జావెద్‌ మియాందార్‌ నెలకొల్పిన రికార్డునూ కోహ్లీ చరిత్రలో కలిపేశాడు. ఈ మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర విరాట్‌ ఈ ఘనత సాధించాడు.

Related posts