telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

శివయ్యా… వినయ్యా !!

దేశం నడిబొడ్డున
అన్నదాతలూ…
రాష్ట్ర నడివీధిలో
శ్రమవిధాతలూ…
వేడుకుంటున్నది
విన్నావా శివా…..!
ఆకలి కడుపుతో ఒకడూ
స్వేద తుంపర్లతో ఇంకొక్కడూ
ఘోషిస్తున్నది
విని ఊరకుంటున్నావా
బ్రతుకులాటగాడా శివుడా…!
నేతి బీరలో
నేయుందని భ్రమను
పాలకుల మనసు
రమించి రంగరిస్తూన్నా
మూడోకన్ను లేపవేమయ్యా గంగాధరా..!
గోచీలపైనా
నీచమైన పన్నులు వేసి,
దేశమంతా పందికొక్కులకు
అప్పనప్పనంగా రాసిచ్చేస్తుంటే
ఝఠాజూటం విధిలించవేమయ్యా ముక్కోపీ!
తిక్కను
తొక్కలు తొక్కలుగా వేస్తూ
రాజకీయం రంగులు పులిమి
బలిసనోళ్ళకు పీఠమేస్తున్నా
శిక్షించవేమయ్యా తిక్కశంకరా!
నీక్కావలసింది బూడిదేనని
దేశమంతా బగ్గిచేసి అవినీతి రగ్గులు కప్పి
మేకినిండియా అంటే…
నీ మహిమతో మము కాపాడమేమయ్యా
ఓంకారేశ్వరా… ఈశ్వరా… మరమేశ్వరా…!
నిను కొలిచే ఎదలలో
ఝంజాటనకు స్వస్తి పలికి
బాధితులను కాపాడయ్యా
శివ శంకరా…! ఉమాపతీ!
సృష్టి స్థితి లయ కారకా…!

Related posts