నేడు రాజ్యసభ లో ఎస్పీజీ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ ప్రారంభించగానే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మూజువాణి ఓటింగ్ జరిపడంతో బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభలో ఇంతకుముందే ఈ బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. సభలో గాంధీ కుటుంబసభ్యులకు ఎస్పీజీ భద్రతను తొలగించడాన్ని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. ఎస్పీజీ సవరణ బిల్లును కేవలం గాంధీల కుటుంబాన్ని ఉద్దేశించి చేయడం లేదని, ఎస్పీజీ చట్టాన్ని సవరించడం ఇది ఐదోసారి అని చెప్పారు. ఈ సవరణ కేవలం గాంధీ కుటుంబసభ్యులను దృష్టిలో పెట్టుకుని చేసింది కాదని తెలిపారు. అయితే, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనని.. గతంలో చేసిన నాలుగు సవరణలు మాత్రం పక్కా వారి కుటుంబం కోసం చేసినవేనని అమిత్ షా వ్యాఖ్యానించారు.
తాము గాంధీ కుటుంబసభ్యులకు సీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించామని, వారు భూమి మీదనే అత్యధిక భద్రతను కలిగి ఉన్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పదవి నుంచి వైదొలగిన ఐదేళ్లకు ఈ ఎస్పీజీ భద్రత ఉండదని స్పష్టం చేశారు. ఒక్క గాంధీ కుటుంబానికే కాకుండా ఇతర మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ భద్రత తొలగించినట్లు అమిత్ షా వివరించారు. తాము ఏ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, అయినా ఆ ఒక్క కుటుంబ భద్రత గురించే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అమిత్ షా ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో పాటు 130 కోట్ల మంది భారతీయులను కూడా రక్షించడం ప్రభుత్వం బాధ్యత అని అమిత్ షా స్పష్టం చేశారు. ఇకమీదట ఎస్పీజీ భద్రత స్టేటస్ సింబల్‌గా ఉండబోదని అన్నారు.