వైసీపీ తన ఐదేళ్ల పాలనలో మొదలుపెట్టి, పూర్తి చేసి, ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టును చూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు.
విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో కియా వంటి ఒక్క పెద్ద కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని విమర్శించారు.
ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుతో ప్రపంచ దేశాలు ఏపీ వైపు చూస్తున్నాయని గంటా అన్నారు.
ఈ సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారని, దీని ద్వారా ఇంధనం, ఐటీ, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ సహా 13 కీలక రంగాల్లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్‌తో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు.

