telugu navyamedia
క్రీడలు వార్తలు

డోపింగ్‌ టెస్టులో దొరకడం పై స్పందించిన పృథ్వీ షా…

భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. వెస్టిండీస్‌తో అరంగేట్ర టెస్ట్‌లో సెంచరీ కొట్టి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో పృథ్వీషా డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డాడు. దగ్గు మందుగా తీసుకున్న సిరప్‌లో నిషేధిత డ్రగ్‌ ఉన్నట్లు తేలడంతో పృథ్వీ షాపై బీసీసీఐ 8 నెలల విధించింది. తాజా ఇంటర్వ్యూలో ఈ చీకటి రోజులను పృథ్వీషా గుర్తుచేసుకున్నాడు. తాను, తన తండ్రి తెలియక చేసిన తప్పిదంతో ఈ కష్టాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. ‘ఈ ఘటనకు నేను, నా తండ్రే బాధ్యులం. తెలియక చేసిన పనితో ఈ కష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ఇండోర్‌లో ప్రిపేర్ అవుతున్నాం. అప్పుడు నేను జలుబు, దగ్గుతో బాధపడుతున్నా. ఆ రోజు రాత్రి డిన్నర్‌కు బయట వెళ్లాం. నా తండ్రికి ఫోన్‌ చేసి మాట్లాడుతుండగా విపరీతంగా దగ్గుతుండటంతో మార్కెట్‌‌లో దగ్గు సిరప్‌ తెచ్చుకో అని చెప్పాడు. నేను డాక్టర్‌ను కన్సల్ట్ కాకుండా దగ్గు సిరప్ తెచ్చుకొని పెద్ద తప్పు చేశా. రెండురోజులకు ఆ సిరప్ తెచ్చుకొని తాగాను. మూడో రోజు డోపింగ్‌ టెస్టులో పట్టుబడ్డాను.. నిషేధిత డ్రగ్‌ వాడినందుకు బీసీసీఐ నాపై 8 నెలల నిషేధం విధించింది. అది నా జీవితంలోనే అత్యంత కఠినమైన దశ. దాన్ని నేను మాటల్లో వర్ణించలేను. నా గురించి జనాలు ఎమనుకుంటున్నారు? వారికి నా ముఖం ఎలా చూపించాలనే ఆలోచనలతో కుమిలిపోయాను. నా కెరీర్ ముగిసినట్లేనా? అని ఆందోళన చెందాను. ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు లండన్‌కు వెళ్లాను. అక్కడ కూడా ఇవే ఆలోచనలు నన్ను వెంటాడాయి. ఓ నెలరోజుల పాటు గదిలో నుంచి బయటికి రాలేకపోయాను.’అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. అయితే పృథ్వీ తాను చేసిన తప్పును బీసీసీఐ ఎదుట నిజాయితీగా ఒప్పుకోవడంతో పాటు తనకు తెలియకుండా నిషేధిత డ్రగ్‌(టెర్బుటలైన్‌) వాడినట్లు తేలడంతో అతని పట్ల సానుకూలంగా వ్యవహరించింది

Related posts