telugu navyamedia
రాజకీయ

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ కీలక ప్రకటన

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి నేటికి 75 సంవత్సరాలు అవుతోంది.దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, కోవిడ్ నిబంధనల మధ్య ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో శత్రుదుర్బేధ్యంగా మారిన ఎర్రకోట వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జెండా ఆవిష్కరణ అనంతరం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. దేశ వ్యాప్తంగా అన్ని సైనిక్ స్కూళ్లలో ఇకనుంచి అమ్మాయిలకు సైతం ప్రవేశం కల్పించనున్నట్లు.. ఎర్రకోట వేదికగా ప్రకటన చేశారు. అలాగే త్వరలోనే జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

రానున్న 25ఏళ్లు అమృత ఘడియలన్న మోడీ ఈ అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి సంకల్పించుకోవాలన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతో వచ్చే ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి అడుగూ కీలకమవ్వాలన్నారు.ప్రతి పౌరుడూ సంకల్ప శక్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు మోడీ. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌.. ఇదే మన నినాదం కావాలన్నారు.

పౌరులందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారతం నిర్మాణం అవుతుందని చెప్పారు మోడీ. ఈ ఏడేళ్లలో ఉజ్వల నుంచి ఆయుష్మాన్‌ వరకు అనేక పథకాలు ప్రజల ముంగిటకు చేరాయన్న మోడీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు హక్కుదారులకు వందశాతం చేరేలా కృషిచేయాలన్నారు.

ప్రతి ఇంటికీ విద్యుత్‌, తాగునీరు అందించడం మనందరి బాధ్యత అని చెప్పిన మోడీ.. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి వివక్షకు తావుండకూడదన్నారు. సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి అన్న మోడీ.. ఏ ఒక్కరూ ఈ లోపంతో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్‌ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ.

Related posts