స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని.. కోవిడ్ మహమ్మారి నుంచి మనం ఇంకా బయటపడలేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషివల్లే కరోనా రెండో దశ వ్యాప్తపై పైచేయి సాధించగలుగుతున్నామని రాష్ట్రపతి చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల అద్భుతంగా రాణించారని.. ఈసారి ఎక్కువ పతకాలు సాధించి సత్తా చాటారని కొనియాడారు.
దేశవిదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేశ 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నందువల్ల ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. విభిన్న సంప్రదాయాలకు నిలయమేకాక అతిపెద్దదైన, అత్యద్భుత ప్రజాస్వామ్యం కలిగిన భారతదేశం వైపు ప్రపంచం చూస్తోంది. మన 75 ఏళ్ల ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోదగ్గ దూరం ప్రయాణం చేశామనడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు. తప్పుడు మార్గంలో వేగంగా ప్రయాణించడం కంటే సరైన మార్గంలో నెమ్మదిగా, స్థిరంగా అడుగులు వేయడం మంచిదని గాంధీజీ మనకు బోధించారు.
కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించాం. కరోనా వల్ల వ్యాపారులు, వలసదారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు.. ఆయారంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశాం. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలి. మన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో టీకాలను అభివృద్ధి చేయడంలో విజయవంతమయ్యారు. కరోనా వైరస్ నుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్లు రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయి.
అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. తోటి వారు వేసుకునేలా ప్రోత్సహించాలి. టీకాలు వేసుకున్నామని నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరిన్ని జాగ్రత్తలు పాటించాలనేదే ఈ మహమ్మారి మనకు నేర్పిన పాఠం. వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ కరోనా ఇంకా పోలేదు. కరోనా కట్టడికి అహర్నిశలు పనిచేసిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, కరోనా వారియర్ల సేవలు వెలకట్టలేనివి. వారి సేవలే కరోనా రెండో దశ వ్యాప్తిని అదుపు చేయలిగాం. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య కార్యకర్తలు కీక పాత్ర పోషించారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. 121 ఏళ్లలో ఈసారే అత్యధిక పతకాలు వచ్చాయి. క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా అమ్మాయిలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి అని రాష్ట్రపతి అన్నారు.