వర్షాకాలం కావటంతో వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా అనేక మరణాలకు కారణం అవుతున్న డెంగీ వ్యాధి నుండి దూరంగా ఉండటానికి లేదా ముందస్తుగా వ్యాధిని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం..ఈ వ్యాధి వచ్చిన వారిలో ముఖ్యంగా ప్లేట్ లెట్ కణాలు తగ్గిపోతాయి. ప్లేట్ లెట్ కణాలు తగ్గిపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. డెంగీతో మంచిర్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఖమ్మంలో ఒక మహిళా జడ్జీ డెంగీ వ్యాధితో మరణించారు.
* డెంగీ వ్యాధి వచ్చిన వారిలో జ్వరం, బాడీ పెయిన్ లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొందరిలో ఈ వ్యాధి వచ్చినప్పటికీ ఇలాంటి లక్షణాలు ఏమీ కనిపించవు. కానీ శరీరంలోని ప్లేట్ లెట్స్ మాత్రం తగ్గిపోతూ ఉంటాయి. అఫెబ్రిల్ డెంగీ అనే పేరుతో పిలవబడే ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. వైద్యులు కూడా పరీక్షలు చేస్తే తప్ప అఫెబ్రిల్ డెంగీ వ్యాధిని గుర్తించలేరు. అఫెబ్రిల్ డెంగీ వచ్చిన వారిలో డెంగీ వ్యాధి లక్షణాలు ఏవీ కనిపించవు.
* రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చిన్నపిల్లలు, వయస్సు పైబడిన వారు, డయాబెటిస్ ఉన్నవారికి అఫెబ్రిల్ డెంగీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.
* బీపీ తగ్గడం, శరీరంపై దద్దుర్లు, అలసటగా అనిపించటం, ఆకలి లేకపోవటం లాంటి లక్షణాలు ఉన్నా డెంగీ వ్యాధి కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యున్ని సంప్రదించి ప్లేట్ లెట్స్ పరీక్షలు చేయించుకుంటే మంచిది.
ఎడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం వలన డెంగ్యూ వ్యాధి ప్రబలుతోంది. ఈ దోమ కుట్టిన 4 నుండి 7 రోజుల తరువాత డెంగీ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిని నివారించటానికి ఎలాంటి టీకాలు లేవు. ఇంటి సమీపంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలను అమర్చుకోవటం, శరీరంలోని అన్ని భాగాలను కప్పేటట్లు దుస్తులు ధరించటంలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.