telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ప్రిజం పబ్ కాల్పుల కేసులో పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు

గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ నుంచి మూడు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బీహార్ ముఠా నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం ప్రిజం పబ్‌లో పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.

ఈ ఘటనలో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రామ్ రెడ్డి, ఇద్దరు బౌన్సర్లకు గాయాలయ్యాయి. బుల్లెట్ పోలీస్ కానిస్టేబుల్ తొడకు తగిలింది. గాయపడిన కానిస్టేబుల్‌ను పోలీసులు స్థానిక కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.

అతడికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు, 23 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ మీడియాకు తెలిపారు. బత్తుల ప్రభాకర్ ప్రిజం పబ్‌కు నిత్యం వస్తున్నట్లు తెలిసింది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా.. కాల్పులు జరిపాడు. ప్రభాకర్‌పై ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నామని, గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో సోదాలు నిర్వహించామని డీసీపీ తెలిపారు.

నిందితుడి గది నుంచి మరో తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభాకర్ ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ స్నేహితుడి గదిలో ఉంటున్నాడు.

విశాఖ జైలులో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ప్రభాకర్‌ను పోలీసులు విచారిస్తున్నారని, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాకర్‌పై 80 కేసులు ఉన్నాయి. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయి. 2023 నవంబర్ నుంచి ప్రభాకర్ పరారీలో ఉన్నాడు.మొయినాబాద్ చోరీ కేసులో ప్రభాకర్ వేలిముద్రలు గుర్తించారు.

చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ పాత నేరస్థుడు. 2022 మార్చిలో ఏపీలోని అనకాపల్లి కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకువెళుతుండగా తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ఇటీవల సైబరాబాద్ పరిధిలోని మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు చోరీలకు పాల్పడ్డాడు.

Related posts