telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు, చరణ్ కు ప్రధాని ఆహ్వానం…!

Ram-Charan

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం “సైరా”. రామ్‌చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయం సాధించింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళ సై, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులను చిరంజీవి స్వయంగా కలిసి ఈ సినిమాను చూడాల్సిందిగా ఆహ్వానించారు. ఆ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీని కూడా చిరంజీవి కలవాలనుకున్నారు. అయితే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కారణంగా ప్రధాని బిజీగా ఉండడంతో వీరిని కలవడం కుదరలేదు. తాజాగా ప్రధాని మోదీ నుంచి తమకు ఆహ్వానం వచ్చినట్టు రామ్‌చరణ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. “అవును.. నేను, నాన్న ప్రధానిని కలవబోతున్నాం. త్వరలోనే ఇది జరుగుతుంది. ఎన్నికల హడావిడి పూర్తిగా తగ్గిన తర్వాత వెళ్తాం. ఈ సమావేశం కోసం మేం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము” అని చెర్రీ చెప్పినట్టు ఆ పత్రిక పేర్కొంది. ఇటీవల మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో ప్రధాని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులను మాత్రమే పిలవడంపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ట్విటర్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ ట్వీట్ సంచలనం సృష్టించిన కొద్ది రోజులకే మెగాస్టార్‌కు, ఆయన తనయుడికి ప్రధాని నుంచి ఆహ్వానం రావడం ఆసక్తికరంగా మారింది.

Related posts