కేరళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెన్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐదు ఎకరాల నుంచి 15 ఎకరాలలోపు భూమి వున్న రైతులను, కౌలుదారులను ఈ పథకం కిందకు తీసుకురానుంది. దీనికి సంబంధించిన రైతుల సంక్షేమ నిధి రూపొందించడానికి కేరళ అసెంబ్లీ కొత్త చట్టాన్ని ఆమోదించింది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ బిల్లు గత నెల 21న అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ పథకంలో రైతులందరూ సభ్యులుగా చేరవచ్చు. ఉద్యానవన పంటలైన రబ్బరు, కాఫీ, తేయాకు, యాలకుల తోటల పెంపందారులు, ఔషద మొక్కలు, నర్సరీ, పండ్లతో టలు, కూరగాయలు పండించే రైతులు కూడా ఈ పథకం లో సభ్యత్వం పొందవచ్చు. అలాగే మత్స్య పరిశ్రమ, తేనెటగల పెంపకందారులు, పట్టుపురుగులు, పౌల్ట్రీ, బాతులు, మేకలు, కుందేళ్లు, పశువులు, పందుల పెంపకం దారులు ఈ పథకం కిందకు వస్తారు. 7.5 ఎకరాల కంటే తక్కువ రబ్బరు, కాఫీ, తేయాకు, యాలకుల తోటలకు వార్షిక ఆదా యం రూ.5 లక్షలకు మించి ఉండదని, దీంతో అసెంబ్లీ సెలక్ట్ కమిటీ సిఫారసు ప్రకారం.. 4.9 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారిని సభ్యులుగా చేర్చకూడదన్న నిబంధనను తొలగించారు.
ప్రతీ రైతు రూ. 100 చందా కింద చెల్లించినట్లైతే, ప్రభుత్వ వాటాతో కలిపి రూ.250 వరకు సహకారం అందించబడుతుంది. ఈ విధంగా 5 ఏళ్ల పాటు చెల్లించినట్లైతే, ఆ రైతుకు 60 ఏళ్లు వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ద్వారా పెన్షన్ పొందుతారు. పెన్షన్ ఎంత మొత్తం అనేది ఆరైతు చెల్లించిన చందా ఆధారంగా లెక్కించబడుతుంది. నెలకు రూ.10వేలకు పైగా ఈ పథకం కింద రైతు పెన్షన్‌ను పొందవచ్చు. త్వరలో రైతు నమోదు ప్రక్రియ చేపట్టనుంది. ఈ పథకంలో సభ్యులుగా చేరేవారు వ్యవసాయంలో కనీసం మూడేళ్ల పాటు కొనసాగి ఉండాలి, అలాగే వారి వయస్సు 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉండాలి. వారు ఇతర సంక్షేమ పథకాలలో భాగస్వాములై ఉండకూడదు. కిసాన్ అభిమాన్ ప్రాజెక్టులో భాగమైన వారు ఈ కొత్త పథకంలో చేరవచ్చు. 25 ఏళ్లు పాటు చందా చెల్లించిన వారు ఒకే సారి నగదు మొత్తాన్ని పొందవచ్చు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న రైతులకు ప్రభుత్వం పెన్షన్ అందించనుంది. రైతుల సంతానానికి విద్య, వివాహం వంటి వాటికి సహకారం అందిస్తుంది. సభ్యులు, లేదా వారి కుటుంబసభ్యులు వ్యవసాయ పనుల్లో ఉండగా ప్రమాదాలు, వన్యప్రాణుల దాడి వల్ల ప్రాణనష్టం కలిగితే వారికి నష్టపరిహారం అందించనున్నారు.
ఆ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసిన మంచు విష్ణు…