telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమై పార్టీ నిర్మాణంపైనా, భవిష్యత్ కార్యాచరణపైనా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పంచాయతీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకు స్థానిక అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ లక్ష్య సాధన కోసం గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పవన్ తెలిపారు. ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించాలని, వారు స్థానిక అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని చెప్పారు.

ఇదే తరహాలో మండల, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని, దాని పనితీరును సమీక్షించి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని వివరించారు.

పార్టీ కమిటీల నియామకంలో మహిళలకు తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ స్పష్టం చేశారు.

ఐదుగురు సభ్యుల కమిటీలో కనీసం ఒకరు, గరిష్టంగా ఇద్దరు వీర మహిళలు ఉండాలని, 11 మంది సభ్యుల కమిటీలో ముగ్గురికి స్థానం కల్పించాలని నిర్ణయించారు.

పార్టీలో అంతర్గత వివాదాల పరిష్కారం కోసం కేంద్ర కార్యాలయం పర్యవేక్షణలో 11 మంది సభ్యులతో ‘కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్’ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే భర్తీ అయిన నామినేటెడ్ పదవుల వివరాలను సమీక్షించిన పవన్, మిగిలిన పదవుల భర్తీలో కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని సూచించారు.

Related posts