telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన లక్ష్యం..

*వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డ‌మే జ‌న‌సేన టార్గెట్‌..
*వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల్చే ప్ర‌స‌క్తే లేదు..
*పార్టీలు వ్య‌క్తిగ‌త లాభాలు వ‌దిలిపెట్టి..ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు కోసం క‌లిసి రావాల‌ని పిలుపు
*వైసీపీ పాలసీపైనే ద్వేషం.. పార్టీ, నేతలపై కాదు. వైసీపీ కార్యకర్తల్ని ఆలోచించాలి..

*దోపిడీ చేసే వైసీపీ గుండాలను జనసైన్యం అడ్డుకున్నారు..

*వైసీపీ సర్కార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవన్ కళ్యాణ్.

జనసైనికులపై వైకాపా చేసే దాడులను వెన్ను చూపేది లేదన్న పవన్.. వైకాపా మహిషానికి మొలిచిన కొమ్ములు విరగ్గొట్టి.. గద్దె దించుతామని స్పష్టం చేశారు. అందుకోసమే జనసేన షణ్ముఖ వ్యూహం అనుసరించనుందని ప్రకటించారు.

ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైకాపాను గద్దె దించి తీరుతామన్నారు. జనసేన అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని ప‌వ‌న్ అన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీరును నిలదీస్తే దాడులకు తెగబడుతున్నారని జనసేనా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తలను వేధిస్తే బీమ్లా నాయక్ ట్రీట్‌మెంట్ తప్పదన్నారు.

ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన లక్ష్యమని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని, రాజధాని అమరావతికి రైతులు భూములు ఇచ్చారని పవన్‌ అన్నారు. రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాక ఎవడబ్బ సొమ్మని రాజధాని మారుస్తారని పవన్ నిలదీశారు. సీఎం మారినప్పుడల్లా రాజధానులు మారవని తేల్చి చెప్పారు. ఏ ప్రభుత్వం చట్టం చేసినా అది కొనసాగుతుందన్న పవన్.. సీఎంలు మారినప్పుడల్లా విధానాలు మారవన్నారు. రాజధానులకు భూములివ్వని రైతులకు తాను ఆరోజు మద్దతిచ్చానని పవన్‌ చెప్పారు. మరి, రైతులు ఒప్పందం చేసుకున్నప్పుడు వైకాపా నేతలు గాడిదలు కాశారా? అని నిలదీశారు. రాజధానికి 32 వేల ఎకరాలు సరిపోవని నాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ అన్నారన్న పవన్‌.. మరి, ఆనాడే 3 రాజధానులు చేస్తామని వైకాపా నేతలు ఎందుకు చెప్పలేదని సూటిగా ప్రశ్నించారు.

రాజకీయాల్లో విభేదాలుండొచ్చని.. వ్యక్తిగత ద్వేషాలొద్దన్నారు. వైసీపీని కూడా గౌరవించడం జనసేన సంస్కారమని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీలో బూతులు తిట్టే వారితో పాటు మంచి నేతలూ ఉన్నారని చెప్పారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉండాలా అని ప్రశ్నించారు. పార్టీ నడపడానికి కావాల్సింది సిద్ధాంతమని, ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుందని పవన్ పేర్కొన్నారు. నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలని, ప్రశ్నించడమంటే మార్పునకు శ్రీకారమని పవన్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ మా సొంత భూమి, పోలీసులను ప్రైవేటు ఆర్మీగా వాడేస్తాం, న్యాయస్థానాలను లెక్కే చేయం, పెట్టుబడుల్లో వచ్చే వాటాలు లాక్కుంటాం, గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం, సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా ప్రజలను తాగిస్తాం, ఒక్క చాన్స్‌ ఇస్తే ఆంధ్రాను వెనక్కి తీసుకెళ్తాం. ఇంకో ఛాన్స్ ఇస్తే స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం” అనేది వైసీపీ ప్రతిజ్ఞ అని చెప్పారు పవన్

అలాగే వైసీపీ మంత్రులపై పవన్ సీరియస్ సెటైర్లు వేశారు. తాను మాట్లాడక ముందే వైసీపీ లీడర్లు తెగ సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. బంతి చామంతి, గోడకు కొట్టినా తిరిగిరాని బంతి అవంతి అంటూ విమర్శలు చేశారు. వెల్లులిపాయి, వెల్లంపల్లి అంటూ సెటైర్లు పేల్చారు. దీంతో సభలో ఒక్కసారి ఉత్సాహం నింపారు.

Related posts