ఫణి తుఫాను బీభత్సంతో ఆతలకుతలమైన ఒడిశాకు ఏపీ ప్రభుత్వం చేయూతను అందించింది. ఒడిశాకు 2 లక్షల టార్ఫాలిన్లు, 200 యాంత్రిక రంపాలను పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే ఒడిశాకు 12 లక్షల మంచినీటి ప్యాకెట్లు ఏపీ ప్రభుత్వం పంపించింది. ఒడిశా సీఎస్‌తో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడారు. ఒడిశాలో లక్షకుపైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో విద్యుత్ స్తంభాలను కూడా పంపించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఫణి ప్రభావం బాగానే ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో రూ.58 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో 70 వేల మందికి ఆహారం సరఫరా చేసినట్లు, రాష్ట్రంలో తుఫాన్ నష్టంపై కేంద్రానికి వివరాలు పంపిస్తామని ఏపీ సీఎస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో దెబ్బతిన్న అన్ని సెల్ టవర్లు పునరుద్ధరణ చేస్తామని అధికారులు తెలిపారు.