పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీరీలకు మద్దతు పలికినట్టుగా పీఓకేలోని ముజఫరాబాద్‌లో జరిగిన సంఘీభావ ర్యాలీలో మరోసారి భారతదేశంపై నోరు జారాడు. భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీరీలు ఆయుధాలు చేబూని పోరాడాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రపంచానికి తాను కశ్మీర్ రాయబారిగా వ్యవహరిస్తూ వారికి బాసటగా నిలుస్తానని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తాను కశ్మీరీలను నిరాశపరచనని చెబుతూ కశ్మీర్ సమస్య మానవతా సంక్షోభమని వ్యాఖ్యానించారు. ఐరోపా యూనియన్, బ్రిటన్ పార్లమెంట్‌లు సైతం కశ్మీర్ అంశాన్ని చర్చించాయని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌లో భారత సేనలు హింసకు తెగబడినా ఎలాంటి ఫలితం ఉండదని మోదీ సర్కార్‌పై మండిపడ్డారు.
భారత్ ఎలా స్పందించినా తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కశ్మీర్ ప్రజలు భారత్‌ను వ్యతిరేకించాలని, బీజేపీ-ఆరెస్సెస్ నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వంపై ఆయుధాలతో తిరగబడాలని కోరారు. అమాయక కశ్మీరీల సహనాన్ని ప్రధాని మోదీ పరీక్షిస్తున్నారని అన్నారు. భారత దళాల అణిచివేతకు విసిగిన 20 సంవత్సరాల కశ్మీర్ యువకుడు తన శరీరానికి బాంబులు అమర్చుకుని పుల్వామాలో సైన్యంపై దాడికి దిగాడని చెప్పుకొచ్చారు. పుల్వామా దాడికి భారత్ పాక్ ను నిందిస్తూ బాలాకోట్‌లో వైమానిక దాడులకు దిగిందని అన్నారు. భారత విమానాన్ని తాము కూల్చివేశామని, వారి పైలట్ (వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్)ను తిరిగి సత్వరమే అప్పగించామని గుర్తుచేశారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని ఇమ్రాన్ అన్నారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు పాక్ తలొగ్గిందని మోదీ భారత్ ప్రజలకు చెప్పుకున్నారని, నిజమైన పాకిస్తానీ ఎన్నడూ మృత్యువుకు భయపడడనే సంగతి మోదీకి తెలియదని చెప్పారు.