షర్మిలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిళ సభకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినందుకే షర్మిళ పసుపు బోర్డు అంటోందని ఫైర్ అయ్యారు. స్పైసెస్ రీజనల్ ఎక్స్ టెన్షన్ బోర్డ్ తో పసుపు కు మంచి ధర వస్తుందని పేర్కొన్నారు. రైతులు పసుపు బోర్డే కావాలంటే కేంద్రం వద్ద మాట్లాడి తీసుకుని వస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అవకాశవాద, హత్యా రాజకీయాలు, బౌతిక దాడులు చేస్తూ పబ్బం గడుపు కోవాలని టీఆర్‌ఎస్ చూస్తోందని ప్రభాకర్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జానారెడ్డి… టీఆర్ఎస్ ను ఎప్పుడూ విమర్శించలేదని కాంగ్రెస్ నేతలే ఆరోపించారని గుర్తు చేశారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డిని గెలిపించుకునేందుకు.. ఎమ్మెల్సీ ఎన్నికలలో చిన్నారెడ్డి, రాములు నాయక్ లను బలిపశువులను చేసారని సంచలన ఆరోపణలు చేశారు. కవితను ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లో పసుపు బోర్డు అంశం లేవనెత్తారని.. రాజశేఖర్ రెడ్డి పసుపు బోర్డును ఎందుకు తేలేదు… ఆయన కనీసం దీనిపై ఎప్పడైనా స్పందించారా అని షర్మిలకు చురకలు అంటించారు.
డీఎస్ చెప్పినా వైఎస్ వినలేదు..ఈ విషయం షర్మిలకు తెలియదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు కాంగ్రెస్ ను గెలిపించేలా ఉన్నాయని.. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు నిజమైన గెలుపు కాదన్నారు. తెలంగాణలో బాగుపడింది ఒక్క కేసీఆర్ కుటుంబమేనని…తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నది కేవలం ఆ నాలుగు నియోజకవర్గాల్లోనే అని తెలిపారు. నలుగురు నాయకుల మధ్య తెలంగాణ నలిగిపోతున్నదని.. 119 నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇది కాదని ఫైర్ అయ్యారు. పీవీ బొమ్మ పెట్టుకుని ఆయన కూతురి సహకారంతో ఎమ్మెల్సీ గెలిచారని.. వచ్చే ఎన్నికల్లో వైయస్ కూతురు షర్మిలను అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, షర్మిళలు కలిసి లోపాయకారి ఒప్పందంతో వెళ్తున్నాయని.. బీజేపీ ఈ కుట్రలను బద్దలు కొడతుందని స్పష్టం చేశారు.