telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తానెవరి రుణం ఉంచుకోను ..అన్నిటినీ తిరిగి ఇచ్చేస్తా

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాని గోవ‌ర్థ‌ణ్ రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ సెటైర్లు వేశారు. గతంలో తాను మంత్రిగా పనిచేసినప్పుడు కాకాణి చూపించిన ప్రేమ, వాత్సల్యం.. అన్నిటినీ తిరిగి ఆయనకు ఇచ్చేస్తానని, తానెవరి రుణం ఉంచుకునే మనిషిని కాదని అనిల్ సెటైర్లు వేశారు . తన నియోజకవర్గంలో కాకాణి శాఖకు సంబంధించిన పనులేవైనా ఉంటే ఆయన్ను కూడా ఆహ్వానిస్తామన్నారు అనిల్.

మొత్తం మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ అంతర్గత రాజకీయాలు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. గతంలో నెల్లూరు జిల్లానుంచి ఇద్దరు మంత్రులుండేవారు. జలవనరుల శాఖ మంత్రిగా అనిల్ పనిచేశారు. ఐటీ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి పదవిలో ఉండగా మరణించారు. ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ఒకటే పదవి లభించింది.

కాకాణి గోవర్దన్ రెడ్డికి వ్యవసాయ శాఖ కేటాయించారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. కాకాణి ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం లేదని కుండబద్దలు కొట్టారు. ఆహ్వానం ఉండి ఉంటే తాను వెళ్లేవాడినని, కానీ తనకు ఇన్విటేషన్ లేదని, అందులోనూ తనకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లలేదని చెప్పారు.

వీరిఇద్ద‌రికీ కోల్డ్‌వార్ జ‌రుగుతుంది అనే ప్ర‌చారం నేప‌థ్యంలో అనిల్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయడం చ‌ర్చానీయాంశ‌మైంది.

Related posts