telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

చిరుజల్లులతో తడిసిన .. తెలుగు రాష్ట్రాలు..

rains in telugu states today

జూన్ నెల వచ్చినా కూడా నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లల్లాడిపోయారు. అలాంటిది నేడు ఒక్కసారిగా చిరుజల్లులు పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం ప్రారంభమై వారాలు దాటుతున్నా.. ఇంతవరకు వరుణి జాడ లేక రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మాన్‌సూన్ రాక కోసం ఎదురుచూస్తున్న వేళ నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. కొన్ని ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ నెల 8వ తేదీన రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వెదర్ డిపార్టుమెంట్ అధికారులు అంచనా వేసినా.. అనుకున్న సమయానికి వరుణుడు కరుణించలేదు. అనంతరం పలు తేదీలు ప్రకటించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం నాడు రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చాయి. రుతుపవనాల రాకతో హైదరాబాద్ కూల్ కూల్‌గా మారింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులు సాయంత్రానికి కాసింత చల్లబడ్డారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, కోఠి, ఎల్‌బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో కోస్తాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

Related posts