ఏపీలో కొత్త ఇసుక విధానం సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది. మార్కెట్‌లో ప్రస్తుతమున్న రేటు కంటే తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇసుక పంపిణీ పెంచకపోతే ధరలు తగ్గవని, స్టాక్ యార్డుల్లో ఇప్పటి నుంచే ఇసుకను నిల్వ చేయాలని అధికారులను ఆదేశించింది. ఎవరూ తప్పులు చేయకుండా చూడాలని కూడా అధికారులకు సూచించించారు ముఖ్యమంత్రి. స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వినతులు ఎక్కువగా పెండింగ్ లో ఉన్న నెల్లూరు, కర్నూల్ , తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. ప్రజాసమస్యలతో పాటు ఇసుక పాలసీపై వారితో చర్చించారు సీఎం. వచ్చే నెల నుంచే కొత్త ఇసుక విధానం రానున్నట్టు కలెక్టర్లకు వివరించారు. అవకాశం ఉన్న ప్రతి చోట ఇసుక రీచ్‌లను పెంచాలన్నారు ముఖ్యమంత్రి . రవాణాలో ఇబ్బంది లేకుండా చూడాలని… ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలన్నారు. ఇటు.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పారు. వచ్చే నెల నుంచి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థికశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు సీఎం. సీఐడీ నుంచి అగ్రిగోల్డ్ బాధితుల జాబితాను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా అగ్రిగోల్డ్ బాధితులకు రశీదులు ఇవ్వాలని సూచించారు జగన్.
కలెక్టర్లు గ్రామ సెక్రటేరియట్ ల పైన దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. గ్రామ సెక్రటేరియట్ పక్కనే నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కల్తీలేని వాటిని అందుబాటులో ఉంచగలిగితే రైతులకు మంచి చేసినట్టేనన్నారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్ పోస్టుల కోసం 22 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారని, ఎలాంటి ఇబ్బందిలు లేకుండా చూడాలని ఆదేశించారు సీఎం. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం ఎప్పుడూ జరగలేదన్నారు. ఎక్కడా విమర్శలు రాకుండా, పూర్తి పారదర్శక విధానంలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు సీఎం. రైతు భరోసా వందశాతం ఇచ్చి తీరుతామన్నారు జగన్. దీనిపై రైతులకు, కౌలు రైతులను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లదన్నారు. కౌలు పత్రం, కార్డు అన్నీ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటాయని, రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో కౌలు రైతులకు 187కోట్ల రుపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆదుకుంటామని హామీ ఇచ్చింది.
పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రాణం.. స్వామి భక్తిని చాటుకున్న బండ్ల గణేశ్