ఏపీలో జనవరి 1వ తేదీ నుండి నూతన బార్ల విధానం అమలులోకి రాబోతుంది. రాష్ట్రంలో ఉన్న 797 బార్లలో 319 బార్లను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త బార్లకు భారీగా ప్రభుత్వం లైసెన్సు ఫీజులను పెంచింది. నిన్న బార్ల రద్దు, కొత్త బార్ల పాలసీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఈ కొత్త బార్లలో అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద భారీగా మద్యం ధరలను పెంచింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కనిష్టంగా 30 రూపాయల నుండి గరిష్టంగా 750 రూపాయల వరకు ప్రభుత్వం పెంచడం గమనార్హం.
విదేశీ మద్యం రేట్లు కనిష్టంగా 30 రూపాయల నుండి గరిష్టంగా 750 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బార్ల పాలసీ 2020 జనవరి 1వ తేదీ నుండి 2021 డిసెంబర్ 31వ తేదీ వరకు రెండు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ప్రభుత్వం బార్ల లైసెన్స్ ధరఖాస్తు ఫీజును 10 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. కొత్త బార్లలో మద్యం ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆహారాన్ని మాత్రం రాత్రి 11 గంటల వరకు అందించవచ్చు. త్రీస్టార్, పై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. జనవరి 1వ తేదీ నుండి ఏర్పాటయ్యే కొత్త బార్లను ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ విధానంలో ధరఖాస్తుదారులకు కేటాయిస్తారు. ధరఖాస్తుదారులు బార్ల లైసెన్స్ ల కోసం ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.