దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య జమ్ముకశ్మీర్, లడాఖ్ లతో తొమ్మిదికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ అండ్ డయ్యూ, దాద్రానగర్ హవేలిని ఒక్కటి చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే వారంలో లోక్ సభలో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రమంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ పార్లమెంట్‌లో ప్రకటించారు. రెండింటి నూతన పరిపాలన గుజరాత్‌కు సమీపంలోని పశ్చిమ తీరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సుపరిపాలన అందించి.. డూప్లికేట్ పనిని తగ్గించే వెసులుబాటు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నిజానికి డామన్ అండ్ డయ్యూ, దాద్రా హవేలి కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాల దూరం 35 కిలోమీటర్లు మాత్రమే. కాస్త దూరంలోనే రెండు సచివాలయాలు, విడివిడిగా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆర్థికభారం పడుతుంది. ఒక పనినే ఇద్దరూ చేస్తున్నారు. అలా కాకుండా రెండింటినీ కలిపితే మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దాద్రా నగర్ హవేలి ఒక జిల్లా కాగా.. డామన్ అండ్ డయ్యూ రెండు జిల్లాలన్న సంగతి తెలిసిందే. కొత్త కేంద్రప్రాంత పాలిత ప్రాంతం పేరు దాద్రా నగర్ హవేలి డామన్ అండ్ డయ్యూగా ఉంటుంది. పరిపాలన కేంద్రంగా డామన్ అండ్ డయ్యూ ఉంటుంది. ఈ మేరకు వచ్చేవారం కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకోనుంది. దీంతో ఇప్పటివరకు రెండుగా ఉన్న కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలు ఒక్కటి కానున్నాయి. వాటి సంఖ్య 9 నుంచి 8కి చేరుకోన్నాయి.