సీఎం ఎన్ చంద్రబాబునాయుడుతో తూర్పు నౌకాదళ కమాండింగ్-ఇన్-చీఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు.
విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సీఎంను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా విశాఖ భవిష్యత్ ప్రణాళికల్లో నేవీ భాగస్వామ్యంపై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది.
ఈ సమావేశంలో వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా తూర్పు నౌకాదళ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి వివరించారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా రక్షణ రంగంలో సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇద్దరూ చర్చించారు.
స్వదేశీ నౌకా నిర్మాణం, సాంకేతికత అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
నేవీ నిర్వహించే ఫ్లీట్ రివ్యూలకు ప్రజల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “విశాఖ నగరం భవిష్యత్తులో అనేక అవకాశాలకు, ప్రతిష్ఠాత్మక సంస్థలకు కేంద్రంగా మారబోతోంది. ఇది ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దుకుంటోంది.
ఈ ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం, నౌకాదళం కలిసి పనిచేయాలి” అని అన్నారు.
విశాఖను కేవలం నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగానే కాకుండా, అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలు అమలు చేస్తున్నామని, దీనికి తూర్పు నౌకాదళం సహకారం అందించాలని కోరారు.
“నేవీ అంటే కేవలం యుద్ధ శక్తి మాత్రమే కాదు. వారి విజ్ఞానాన్ని, నైపుణ్యాలను ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరువ చేయాలి.
నేవీ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన పెరిగి, స్ఫూర్తి పొందుతారు” అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఏపీ యువత రక్షణ రంగంలో చేరేందుకు చూపిస్తున్న ఆసక్తి సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు.
నౌకాదళం చేపట్టే వివిధ ప్రాజెక్టులు, ఇతర కార్యకలాపాలకు అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు సీఎం హామీ ఇచ్చారు.

