telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రిటైర్మెంటు లేని బతుకులు…

రెక్కాడితే గాని డొక్కాడని
బ్రతుకులు మావి
పొద్దుగాల లేస్తూనే
నాగలి పట్టి ఎడ్లను కట్టి
పొలానికి వెళ్ళటమే
మా దిన చర్య.
ఎండనకా, వాననకా,రెక్కలు
ముక్కలు చేసి సేద్యం చేసి
పంటకు మందులు వేసి
వేళకు నీరు పెట్టి కన్న బిడ్డ కన్నా
ఎక్కువ మమకారంతో పెంచి
పోషిస్తే ఫలసాయంలో
పెట్టుబడి పోను దళారిల
వంతు పోను మాకు మిగిలింది
బ్రతుకు ఈడ్వటమే కష్టమాయే.
నాలుగేళ్ళు నోటిలో కెళ్ళాలంటే
ఈ బడుగు జీవితం తప్పదాయే.
మా జీవన పర్యంతం సుఖాలు
నోచుకొక కలకాలం కష్టాలకే
పరిమితమాయే మా జీవితం.
స్వేఛ్ఛా జీవి రైతన్న
అన్న దాతలంటూ ప్రభుత్వం
వారి బిరుదులు.
స్వేదం చిందించి
మట్టి మనిషిగా బ్రతికే
మాకు పదవీ విరమణ లేదా?
ఎన్నాళ్లీ బ్రతుకులు.
వేళా పాళా లేని కొలువాయే
వాన రాక పొలాలకు సకాలంలో
నీరందక వానకోసం నింగి కేసి
నీటి చుక్క కోసం నిరీక్షణాయే
బీడు భుములను నిరంతరం చుస్తూ.
వయసుతో పని లేదాయే
ముసలీ ముతకా చిన్నా పెద్దా
తారతమ్యం లేదాయే రైతాంగానికి.
ఓపిక ఉన్నంత వరకు
దుక్కి దున్ని పంటలేయటమే
కృషీవలుని విరామం లేని నిత్య కృత్యం.
ఎన్నాళ్లీ జీవితాలు
ఇంత కష్టం చేసి
పిడికెడు మెతుకులకు
నోచుకోని బ్రతుకులాయే
రైతన్న వెతలు చూసి కరగవాయే
పెద్దవారి మనసులు
దిన దిన గండం నూరేళ్ళ అయుష్షాయే
రైతన్నల బ్రతుకులు
విసుగూ విరామం లేని జీవితాలాయే…

Related posts