telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కలర్ ఫోటో” టీంకు నాని ప్రశంసలు

Nani

సుహాస్ హీరోగా నటించిన ”కలర్ ఫోటో” బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా… చాందిని దీప్తి అనే పాత్రలో నేచురల్ పెర్ఫార్మన్స్ తో స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో చాందినీ తన నటనతో ఆడియన్స్ ని ఏడిపించింది. సీనియర్ కమెడియన్ సునీల్ విలన్ గా నటించాడు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా, కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందించాడు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘హృదయ కాలేయం’ సాయి రాజేష్ నిర్మించారు. ఇటీవల `ఆహా` యాప్ ద్వారా విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంటోంది. తాజాగా ‘కలర్ ఫోటో’ సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు సందీప్ రాజ్, హీరో సుహాస్‌ను ప్రత్యేకంగా నాని అభినందించారు. “సందీప్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. అతడిని పరిచయం చేయాలనే కోరిక నాకు బలంగా ఉండేది. దాన్ని నేను మిస్సయ్యాను. నా అంచనాలకు మించిన ఒక అందమైన సినిమా తీశాడు. తన రెండో సినిమా వాల్‌ పోస్టర్ సినిమా బ్యానర్‌‌కు ఛాన్స్ ఇస్తే తప్పకుండా చేస్తాను. ఈరోజు ‘కలర్ ఫోటో’లో కొన్ని సీన్స్ చూస్తుంటే అందులో సుహాస్ చేసినట్టు ఇంకెవరూ చేయలేరేమో.. ఆ ఎమోషన్స్‌ను అంత బాగా చూపించే యాక్టర్ తెలుగులో మరొకరు లేరేమో అనిపించింది. ఇది సుహాస్ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. భవిష్యత్తులో సుహాస్ ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి. కుదిరితే సుహాస్‌తో నేను కలిసి చేయాలి’’ అని నాని ప్రశంసించారు. ఇది కచ్చితంగా థియేటర్‌లో చూడాల్సి సినిమా అనిపించిందని, ఈ సినిమాలో కాల భైరవ మ్యూజిక్, ఎడిటింగ్, సందీప్ రాసిన డైలాగులు.. సుహాస్, చాందిని, సునీల్ నటన తనకు చాలా నచ్చాయని చెప్పారు. ఇదొక మరపురాని చిత్రమని కొనియాడారు.

Related posts