telugu navyamedia
సామాజిక

‘నాగ పంచమి’ ప్రత్యేకత

నేడు శ్రావణ మాసం తొలి శుక్రవారం మరియు నాగ పంచమి. మహిళలు నాగ దేవత ఆలయాలకు లేదా పుట్టల వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమినే నాగ పంచమిగా జరుపుకుంటారు. దీనినే గరుడ పంచమిగా పిలుస్తారు. ఈ ఏడాది ఆగస్టు 12, 13 తేదీల్లో నాగుల పంచమి వచ్చింది. భారతీయ సంస్కృతిలో నాగ పూజకి ఓ విశిష్టత ఉంది. విష్ణుమూర్తి, ఆదిశేషువును అనుగ్రహించిన రోజునే నాగుల పంచమి అని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగాడట. తాము ఉద్బవించిన పంచమి రోజున సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడట. ఆదిశేషుని కోరికను మన్నించిన మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున ప్రజలంతా సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడట. మహాభారతం, స్కంద పురాణం, నారద పురాణ, రామయాణం ప్రకారం.. నాగుల పంచమతి రోజున సర్ప పూజ చేస్తే అంతా శుభం కలుగుతుంది.

నాగ పంచమి పర్వదినాన మహిళలు ముందుగా ఇల్లు, వాకిలి శుభ్రం చేస్తారు. తలస్నానం చేసి, నిత్యపూజ పూర్తి చేస్తారు. ఇంటికి సమీపంలో ఉన్న పుట్టదగ్గరికి వెళ్తారు. పుట్ట ముందు నీళ్లు జల్లి ముగ్గువేస్తారు. పసుపు, కుంకుమలతో అర్చిస్తారు. దీపం వెలిగించి అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ ఐదు నాగ దేవతలను మనసులో స్మరించుకొని భక్తిగా నమస్కరిస్తారు. పాలు, పండ్లు, నువ్వులు, జొన్న పేలాలు, పంచామృతం, గోధుమల పాయసం నాగమయ్యకు నివేదనగా సమర్పిస్తారు. నాగ విగ్రహాలకు అభిషేకం చేస్తారు. అంతేకానీ, పాలను పుట్టలో నేరుగా పోయకూడదు. పూజ పూర్తయిన తర్వాత భూమి, ఆకాశం, వాగూ-వంక, వాపీ-కూప, తటాకాదులలో సంచరించే నాగులేవీ తమకు, తమ కుటుంబసభ్యులకు కీడు చేయకూడదని ప్రార్థిస్తారు. తల్లి దాస్యం తొలగించడం కోసం గరుత్మంతుడు చేసిన సాహసం, ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా భావించి ఆరాధించడం, సమస్త జీవజాతినీ కారుణ్యంతో చూడటం వంటి విషయాలను ఈ పండుగల ద్వారా గ్రహించాలి.

Related posts