telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎన్ .టి .ఆర్. తో కృష్ణకుమారి అనుబంధం

ఎన్ .టి .రామారావు గారితో ఎంతోమంది కథానాయికలు నటించారు. అయితే వారిలో కృష్ణకుమారితో కలసి రామారావు 21 చిత్రాల్లో నటించారు . ఎన్ .టి .రామారావు ‘షావుకారు ‘ సినిమాలో కృష్ణ కుమారి అక్క జానకితో కలసి మొదటిసారి నటించారు . ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ నాగిరెడ్డి , చక్రపాణి నిర్మించారు .
1949 లో ఎన్ .టి .ఆర్ ‘మనదేశం ‘ సినిమా ద్వారా సినిమా రంగానికి పరిచయం అయ్యారు . ఈ సినిమాకు దర్శకుడు ఎల్ .వి .ప్రసాద్. . మీర్జాపురం రాజా నిర్మాత. ఈ సినిమా తరువాత ఎల్ .వి . ప్రసాద్ ‘షావుకారు ‘సినిమాలో రామారావుకు హీరోగా అవకాశం ఇచ్చారు . ఈ సినిమాలో జానకి అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేశారు.


‘షావుకారు ‘ సినిమా షూటింగ్ కు అక్క జానకితో పాటు కృష్ణకుమారి కూడా వచ్చేది . అప్పుడు రామారావు అందం చూసి అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఫిదా అయిపోయారు . అయితే జానకికి అప్ప్పటికే పెళ్లయిపోయింది . కృష్ణ కుమారి మాత్రం వీలైనప్పుడల్లా రామారావు అందం తనివితీరా చూస్తూండేది. నాలుగు సంవత్సరాల తరువాత కృష్ణకుమారి కల నెరవేరింది .
1953లో రామారావు స్వంత చిత్ర నిర్మాణం ప్రారంభించారు . అదే ‘పిచ్చి పుల్లయ్య ‘. ఈ సినిమాకు తాతినేని ప్రకాశరావు దర్శకుడు , రామారావు సోదరుడు త్రివిక్రమరావు నిర్మాత. ఈ సినిమాలో రామారావు కృష్ణకుమారిని హీరోయిన్ గా ఎంపిక చేశారు . ఇదే సినిమాలో కృష్ణకుమారి అక్క షావుకారు జానకి కూడా నటించింది .
ఈ సినిమా తరువాత రామారావుకు కృష్ణకుమారి నటన , ప్రవర్తన బాగా నచ్చాయి . ఆ తరువాత కృష్ణకుమారితో కలసి వినాయక చవితి వీర కంకణం రాజనందిని , లక్షాధికారి, బందిపోటు , గుడిగంటలు , శ్రీకృష్ణ తులాభారం , చిక్కడు – దొరకడు , శ్రీకృష్ణవతారం , ఉమ్మడి కుటుంబం , భువనసుందరి కథ , వరకట్నం , తిక్క శంకరయ్య , నిండు సంసారం , దేవాంతకుడు , అగ్గి పిడుగు , కలవారి కోడలు చిత్రాల్లో కలసి నటించారు .
ఈ జంటను ప్రేక్షకులు బాగా ఆదరించారు . ఎన్ .టి .ఆర్ కు కూడా నాయికలందరిలో కృష్ణకుమారి అంటే ప్రత్యేకమైన అభిమానం .

Related posts