కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ ఖాతాదారులకు కేంద్ర కార్మికశాఖ శుభవార్త చెప్పింది. వారి వేతనంలో 50 శాతం సొమ్మును నిరుద్యోగ భృతిగా చెల్లించనున్నట్టు ప్రకటించింది. అటల్ బీమిత్ కల్యాణ్ యోజన కింద ఈ సాయం అందించనున్నట్టు తెలిపింది.
ఉద్యోగాలు కోల్పోయిన వారు సమీపంలోని ఈఎస్ఐ కార్యాలయంలో స్వయంగా సంప్రదించి కానీ, ఆన్‌లైన్‌లో కానీ, పోస్టులో కానీ దరఖాస్తులు పంపవచ్చని పేర్కొంది. దరఖాస్తుతోపాటు ఆధార్ కాపీ, బ్యాంకు వివరాలు, అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ఏడాదిపాటు అంటే వచ్చే ఏడాది జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది.
గతంలోనూ నిరుద్యోగ భృతి లభించేది. అయితే, అప్పుడు వేతనంలో కేవలం 25 శాతం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దానిని 50 శాతానికి పెంచారు. గతంలో సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తు పంపించే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునేలా నిబంధనలు సడలించారు.