ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమవుతుంది. వచ్చే నెల 3, 4 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియనున్నందున పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవోలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని సూచించింది.
మండలపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) పరిధిలో ఉన్న ఆయా గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను మండలపరిషత్ కార్యాలయాల్లోనూ, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ) పరిధిలోని అన్నీ గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను జడ్పీ కార్యాలయాల్లోనూ పరిశీలనకు ఉంచాలని పేర్కొంది. కాగా పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది.