టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రెండు రోజుల క్రితం వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఘాటుగా స్పందించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదుగుల కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని గల్లా సవాలు విసిరారు. గుంటూరు నుండి వైసీపీ అభ్యర్ధిగా మోదుగుల పోటీ చేస్తే నా సత్తా ఏమిటో చూపిస్తానని జయదేవ్ అన్నారు. వైసీపీకి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టేనని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు మోదుగుల మొదటి నుంచి తనకు గౌరవం ఇచ్చేవాడు కాదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తన పేరు కూడా ప్రస్తావించేవాడు కాదని జయదేవ్ ఆరోపించారు.
టీడీపీ డేటా చోరీ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఏపీని కేసీఆర్ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని, మోదీ పాలసీలు, మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. కశ్మీర్ పరిస్థితులను మోదీకి అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మోదీకి ఓటేసినట్లేనని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.