telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మధ్యప్రదేశ్ సీఎంకు కరోనా

Shivaraj-singh

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమైంది. మనిషి నుంచి మనిషికి సోకడం నుంచి మెల్లిగా సమూహ వ్యాప్తి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు కోవిడ్ సోకింది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. నిత్యం వారు ప్రజల్లో తిరుగుతుండడంతోపాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో వారికి కరోనా సులువుగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. అయితే తొలిసారిగా ఓ ముఖ్యమంత్రికి కరోనా సోకింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఏకంగా సీఎంకే కరోనా సోకడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కరోనా లక్షణాలు బయట పడడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఆయనకు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు రిపోర్టు అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సీఎం నివాసం, సచివాలయాన్ని శానిటైజ్ చేశారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనతో పాటు వివిధ కార్యక్రమాల్లో, సమావేశాల్లో పాల్గొన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. ముఖ్యంగా తనను కలిసిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. పాలనకు సంబంధించిన సమీక్షలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తానని శివరాజ్ సింగ్ చౌహన్ చెప్పారు.

Related posts