telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అర్జున్ సురవరం” మా వ్యూ

Arjun-Suravaram

బ్యాన‌ర్‌ : మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి
న‌టీన‌టులు : నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : టి.సంతోష్‌
సంగీతం : సామ్ సి.ఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ : సూర్య‌
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
స‌మ‌ర్ప‌ణ‌ : ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌ : రాజ్‌కుమార్ అకెళ్ల‌

యంగ్ హీరో నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో టి.ఎన్. సంతోష్ తెర‌కెక్కించిన చిత్రం “అర్జున్ సుర‌వరం”. త‌మిళంలో సూప‌ర్ సక్సెస్ అందుకున్నక‌నిత‌న్‌కి రీమేక్‌గా అర్జున్ సుర‌వ‌రం చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్నలిస్ట్ పాత్ర‌లో నటించాడు. మార్చి లోనే విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. “ముద్ర” అనే టైటిల్‌ని ముందుగా ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. కాని అదే పేరుతో జ‌గ‌ప‌తి బాబు చిత్రం విడుద‌ల కావ‌డంతో పేరు మార్చి “అర్జున్ సుర‌వ‌రం” పేరుతో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు మేక‌ర్స్‌. మేడే సంద‌ర్భంగా మే 1న మూవీని రిలీజ్ చేద్దామ‌నుకున్న‌ప్ప‌టికి అది వీలు కాలేదు. అవెంజ‌ర్స్ చిత్ర రిలీజ్ కార‌ణంగా సినిమాని మ‌రోసారి వాయిదా వేశారు. ఎట్ట‌కేల‌కి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ :
ఓ చిన్న ఛానెల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పని చేస్తుంటాడు అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్). బీబీసీలో జాబ్ సంపాదించాలన్నది అతడి కల. ఒకరోజు ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కోసం పబ్‌కు వెళ్లిన అర్జున్ కు అక్కడ అనుకోకుండా కావ్య (లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి తారసపడుతుంది. కావ్య కూడా జర్నలిస్ట్. ఓ రోజు అర్జున్ కు బీబీసీ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడ జాబ్ సెలెక్షన్ ప్రాసెస్ అంతా పూర్తి అవుతుంది. కానీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసే సమయానికి… అతని సర్టిఫికెట్లు అబద్ధమని పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. దీంతో అర్జున్ సురవరం అబద్ధంగా మిగిలిపోతాడు. దీంతో అర్జున్ ఈ ఫేక్ సర్టిఫికెట్ల వెనుక ఉన్న వారెవరు ? తాను అబద్ధం కాదు నిజం అని నిరూపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? ఆ ప్రయత్నాలలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు ? అసలేం జరిగింది ? అనేది తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
యంగ్ హీరో నిఖిల్ అర్జున్ లెనిన్ సురవరం పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో మెప్పిస్తాడు. కావ్యగా నటించిన లావణ్య త్రిపాఠి లుక్స్ పరంగా, ఎమోషనల్ సీన్స్‌లోనూ నటనతో ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్, విద్యుల్లేఖరామన్, సత్య తమ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తారు. నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో పోసాని నటన ఆకట్టుకుంటుంది. తరుణ్ అరోరా, రాజా రవీంద్ర విలన్లుగా సరిగ్గా సరిపోయారు. నాగినీడు, ప్రగతి తదితరులు తమ పరిధిమేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు సంతోష్ కూడా తమిళంలో హిట్ అయిన కణిథన్ మూవీ కథను తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో చాలానే మార్పు చేర్పులు చేశాడు. అయితే ఫీల్ ఇక్కడ మిస్ అయినట్లుగా అన్పిస్తుంది. క్లైమాక్స్ ఊహించినంత ఆసక్తికరంగా ఉండదు. ఇక శ్యామ్ సీ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు సందర్భానుసారంగా వస్తున్నట్టుగా అన్పించవు. సినిమాకు తగ్గట్లుగా నిర్మాణ విలువలు ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts