దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణేశుని మండపాలలో నవరాత్రి ఉత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు పారవశ్యంతో వారివారి కోరికలను గణేశునికి విన్నవించుకుంటున్నారు. ఈ ఉత్సవాలలో గణేశుడు అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ రూపాలను దర్శించుకోడానికి కొందరు ఆయా మండపాలకు వస్తుండటం గమనార్హం.
ఎంతో ఆదరణ పొందిన ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు బయట ప్రాంతాల భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. దీనితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు ట్రాఫిక్ దిగ్బంధంలో ఉన్నాయి.