వరుస సెలవులతో నేడు-రేపు నామినేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. నిన్నటి వరకు ప్రముఖ పార్టీల అగ్రనేతలు వారివారి నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల సెలవలు, సోమవారం ఆఖరు తేదీ కావడంతో.. ఆరోజు అధికంగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. నామినేషన్ ప్రక్రియతో సోమవారం ఎన్నికల నగారా మోగిన రాష్ట్రాలలో హడావుడి భారీగానే ఉండనుంది. ఇదే సమయంలో ఏ రెండు పార్టీలు ఎదురైనా కూడా గొడవలు కూడా జరిగే అవకాశం ఉండటంతో.. సోమవారం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ.. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుందని తెలిపారు. రెండ్రోజులు సెలవులు కావడంతో నామినేషన్ల ప్రక్రియ నిలిచిపోతుందన్నారు. ఈ నెల 28 వరకూ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని వెల్లడించారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.