telugu navyamedia
తెలంగాణ వార్తలు

మీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదు -బీజేపీకి మంత్రి తలసాని శ్రీనివాస్ వార్నింగ్‌

డిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రాగా, ఆమె తన పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం బిజెవైఎం శ్రేణులు, బీజేపీ మహిళా నాయకులు బంజారాహిల్స్ లోని కవిత ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దీంతో కవిత ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది

కవిత ఇంటిపై బిజెపి నాయకులు దాడికి యత్నించడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు ,కార్పోరేటర్లు, భారీగా కార్యకర్తలు, అనుచరులతో కలిసి కవిత నివాసానికి వెళ్లి ఆమెకు తమ సంఘీభావం తెలిపారు.

వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటిపైకి రావడం దుర్మార్గమైన, హేయమైన చర్యగా అభివర్ణించారు. బీజేపీ నేతల తీరు సిగ్గుచేటన్నారు.

మీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదని, తమ టీఆర్ఎస్ సైన్యం ఎంత ఉందో మీకు అంద‌రికి తెలుసు అని అన్నారు.ఇంటిమీదికైనా వెళ్లి దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారా? మేం దాడులు చేస్తే బీజేపీ నేతలు మిగులుతారా? క్రమశిక్షణ అంటే ఇదేనా? బీజేపీ నేతలు చెప్పాల‌ని అన్నారు.

అసలు ముట్టడికి కారణం ఏంటో, ఆ అంశంపై వచ్చిన వాళ్లకు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన మాటలను, ఫాల్స్ ఎలిగేషన్ ను పట్టుకొని, బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సిగ్గుచేటన్నారు.

సంఘీభావం చెప్పడానికి వచ్చిన మా కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తాము అని అంటున్నారు.. మేము ఊ అంటే బీజేపీ పరిస్థితి ఏందన్నారు. కవిత ఇంటిపై బీజేపీ నేతల ముట్టడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

Related posts