telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ డబ్బుతో దేశాన్ని సాకుతున్నారు.. అక్క‌డ మా కేసీఆర్ ఫోటో పెట్టాలి

తెలంగాణ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపులో ప్రధాని మోదీ ఫొటోలేదని అడగడం హాస్యాస్పదం అన్నారు.

 పేదలకు మేము ఉచితంగా రేషన్‌ బియ్యం ఇస్తున్నాము. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని.. తెలంగాణ నిధులే కేంద్రానికి వెళ్తున్నాయని హరీశ్ రావు చెప్పారు.

ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తాను. చేరినట్లైతే నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేస్తారా? అని కౌంటర్‌ ఇచ్చారు.

కేంద్రంలో ముందుగా మా కేసీఆర్ ఫోటో పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రమంత్రలు నోరు విప్పితే అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని.. అబద్ధాలు చెప్పి నిజాలు దాచే ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్ రావు చురకలు వేశారు.

రేషన్ షాపులకు మొత్తం బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని గుర్తుచేశారు. దేశానికి మేం రూ.1.7 లక్షల కోట్లు అదనంగా ఇచ్చామని.. మీరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని , మేం వాస్తవాలు మాట్లాడుతున్నామని హరీశ్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ డబ్బుతో దేశాన్ని సాకుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ డబ్బుతో కేంద్రం పథకాలు అమలు చేస్తుంది.

పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఏటా రూ.3,610 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారలేదని అమిత్ షా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Related posts