telugu navyamedia
తెలంగాణ వార్తలు

పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేష్ పాడి మోసిన మంత్రి ఎర్రబెల్లి

అగ్నిపథ్ స్కీమ్‌పై నిరసనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు జరిపిన‌ కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ మృతదేహాన్ని వ‌రంగ‌ల్ ఎంజీఎం మార్చురీ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు.

శనివారం ఎంజీఎంకు వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి.. యువకుడు రాకేష్ మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం ఎంజీఎం నుండి ఖానాపూర్ మండలం డబ్బీర్ పేట వరకు జరిగిన రాకేష్ అంతిమ యాత్రలో కాలినడకన పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి రాకేష్ పాడే మోశారు.

ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న వారి భావోద్వేగాలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆడుకుంటోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో రైతుల విషయంలో రాజకీయాలు చేసి క్షమాపణ చెప్పినట్లుగానే ప్రధాని మోదీ అగ్నిపథ్ విధానంపై సైతం క్షమాపణ చెప్పి- పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌ విధానం అదో అమోమయ విధానంలాగ ఉందని, దీని ద్వారా యువత ప్రాణాలను కేంద్రం బలిగొంటుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related posts