telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సాంకేతిక

మెట్రో దెబ్బకు .. కుదేలైన ఆర్టీసీ .. ప్రత్యాన్మాయం వైవు అడుగులు..

metro slashed RTC in hyderabad

హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కుదేలైంది, దీనితో కొత్త దారులు వెదుకుతున్నది. ఆపరేషన్ రేషియే పెంచుకునేందుకు దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ పరిధిలో విస్తృత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోరైలు అందుబాటులోకి రావడంతో కుదేలైన గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యామ్నాయాల వైపు పయనిస్తున్నది. ఇప్పటికే మెట్రో కారిడార్ల ప్రాంతాల్లో చాలా సర్వీసులను రద్దు చేసింది. రూటు మార్చి ఇతర ప్రాంతాలకు బస్సులను తిప్పుతున్నది. డిమాండ్ ఉన్న రూట్ల మార్గాల్లో నడుపడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నది. గతంలో సికింద్రాబాద్ నుంచి నాగోల్ మార్గంలో బస్సులు కిక్కిరిసి పోయేవి. ప్రస్తుతం చాలా బస్సుల్లో సీట్లకు మించి ప్రయాణికులు ఉండటం లేదు.

హైటెక్‌సిటీ మార్గంతోపాటు మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, ఎల్బీనగర్ మార్గంలో ప్రయాణించే సిటీ బస్సుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో చాలా సర్వీసులు రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గ్రేటర్ ఆర్టీసీపై నిర్వహణ భారం పెరుగుతున్నది. ప్రతీరోజు 3 వేల ట్రిప్పులు తిరిగి సుమారు 30 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే గ్రేటర్ ఆర్టీసీ ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య తగ్గి విలవిలలాడుతున్నది. ఇప్పటికే రోజుకు కోటి రూపాయల చొప్పున నష్టాన్ని భరిస్తున్న గ్రేటర్ ఆర్టీసీకి మెట్రో ప్రాజెక్టు రూపంలో మూలిగేనక్కపై తాటిపండు చందంగా మారింది. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు రీ సర్వే చేయాలని భావిస్తున్నారు. డిమాండ్ రూట్లలో మాత్రమే బస్సులు నడిపించాలని యోచిస్తున్నారు. శివారు మార్గాలతోపాటు నగరంలోని రూట్లను రీ సర్వే చేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. పకడ్బందీగా సర్వే చేయకుంటే గ్రేటర్ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని తెలిపారు. రూట్ రీ సర్వే పకడ్బందీగా చేపడితేనే గ్రేటర్ ఆర్టీసీ మనుగడ ఉంటుందని అన్నారు.

Related posts