మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు హాజరయ్యారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు.
ఆదిత్య ఠాక్రే తప్ప శివసేన నుంచి మంత్రి పదవులు దక్కించుకున్న ఎమ్మెల్యేలంతా ఏక్‌నాథ్ షిండే క్యాంపులో ఉండటంతో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే మాత్రమే శివసేన నుంచి కేబినెట్ భేటీకి హాజరు కావడం గమనార్హం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేందుకు ఉద్ధవ్ సుముఖంగా లేనట్లు తాజా సమాచారం.
ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరిన మంత్రుల సంగతి పక్కనపెడితే మిగిలిన మంత్రుల మద్దతు ఉండటంతో సీఎం పదవిలోనే కొనసాగాలని ఉద్ధవ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
కేబినెట్ భేటీ కంటే ముందు ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన పార్టీల పెద్దలతో ఫోన్ ద్వారా చర్చలు జరిపినట్లు తెలిసింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఉద్ధవ్ ఠాక్రే ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని సోనియా, పవార్ ఉద్ధవ్‌కు సూచించినట్లు సమాచారం.