telugu navyamedia
వార్తలు సామాజిక

లంచం కోసం గేదెను తీసుకొచ్చిన మహిళ!

baffallow

దేశ వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో లంచగోడితనం రోజురోజుకు పెరిగిపోతుంది. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది లంచం అడిగారని తన ఇంట్లోని గేదెను తోలుకొని ఆఫీసుకొచ్చింది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలోని సిహ్వాల్ గ్రామంలో జరిగింది. పూర్వీకుల ఆస్తిని తన పేరట పట్టా మార్పు కోసం అవసరమైన పత్రాల కోసం లంచం అడగ్గా ఓసారి నగదు రూపంలో ఇచ్చుకున్న రామకాళి పటేల్ అనే మహిళ, మళ్లీ లంచం అడగడంతో తన వద్ద అంత సొమ్ము లేదంటూ గేదెను తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చింది.

నౌధియా గ్రామానికి చెందిన రామకాళి ఆస్తి పత్రాలకు సంబంధించి తహసీల్దార్ మైకేల్ టిర్కీని సంప్రదించింది. పని జరగాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని కార్యాలయం సిబ్బంది చెప్పారు. చేసేది లేక వాళ్లు అడిగినంత చెల్లించింది. పని జరగకపోగా మళ్లీ లంచం అడగడంతో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ లంచంగా గేదెను తీసుకోమని తోలుకొచ్చింది. దీనిపై తహసీల్దార్ ను మీడియా వివరణ కోరగా, రామకాళి పత్రాల వ్యవహారం ఎస్డీఎం కార్యాలయానికి చెందినదని, కానీ తహసీల్దార్ కార్యాలయం వారు లంచం అడిగారని ఆమె ఆరోపిస్తోందని తెలిపారు.

Related posts