భారత క్రికెట్ సారధి, పరుగుల యంత్రం విరాట్‌కోహ్లీ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. శతకం కొడితే చాలు కొత్త రికార్డు బద్దలవ్వాల్సిందే అన్నట్లు సాగుతోంది అతడి ప్రయాణం. విండీస్ జట్టుపై కోహ్లీ(120) వన్డేల్లో 42వ శతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ శతకం ద్వారా అతడి రికార్డుల కిరీటంలో మరో మైలురాయి చేరింది. వెస్టిండీస్ దీవుల్లో.. ఒకే వన్డేలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా బ్రయాన్‌లారా పేరిట ఉన్న 16 ఏళ్ల రికార్డును కోహ్లీ తిరగరాశాడు. 2003లో అప్పటి విండీస్ సారథి బ్రయాన్‌లారా బ్రిడ్జ్‌టౌన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 116 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏ కెప్టెన్ కూడా విండీస్‌లో జరిగిన వన్డేల్లో ఇన్ని పరుగులు సాధించలేడు.
రెండో వన్డేలో పిచ్ నెమ్మదిగా ఉన్నా కోహ్లీ ఎంతో సమన్వయంతో ఆడి 120 పరుగులు సాధించాడు. అతడికి శ్రేయస్ అయ్యర్(71) తోడవ్వడంతో జట్టును ముందుండి నడిపించాడు. ఈ క్రమంలోనే లారా రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే శతకాల సంఖ్య(42).. అటు టెస్టుల్లో కానీ, ఇటు వన్డేల్లో కానీ కోహ్లీ సాధించిన అర్ధశతకాల కన్నా ఎక్కువ కావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే విరాట్‌కు ఎంత పరుగుల దాహం ఉందో అర్థం చేసుకోవచ్చు.