telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాఠశాల విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి రాజకీయ నిరసనలు చేయటం చట్ట విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేసిన: మంత్రి నారా లోకేశ్‌

సామాజిక మాధ్యమాల ద్వారా అందిన ఒక ఫిర్యాదుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే స్పందించారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాల విద్యార్థులను రాజకీయ నిరసనకు తరలించడం, ఆపై జరిగిన ప్రమాదంలో విద్యార్థులు గాయపడటం వంటి తీవ్రమైన అంశాలపై ఆయన సీరియస్ అయ్యారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌కు చెందిన విద్యార్థులను ఓ మాజీ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి తీసుకెళ్లారని శ్యామ్ అనే వ్యక్తి మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు.

పాఠశాల యూనిఫాంలో ఉన్న విద్యార్థులను ఈ రాజకీయ నిరసనకు తీసుకెళ్లేందుకు ఎంఈఓ, హెచ్ఎం అనుమతించడం దిగ్భ్రాంతికరమని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

నిరసన అనంతరం తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారని, వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని శ్యామ్ తెలిపారు.

ఎంఈఓ, హెచ్ఎంల బాధ్యతారహిత ప్రవర్తన వల్లే ఈ ఘటన జరిగిందని, విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి, పాఠశాల సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన ఎంఈఓ, హెచ్ఎంలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. విద్యార్థుల భద్రతతో రాజీపడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించరాదని, త్వరగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు శ్యామ్ తన ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.

శ్యామ్ చేసిన ట్వీట్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే స్పందించారు. “ఇది చాలా దారుణం. నేరం కూడా..! దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను” అని లోకేశ్‌ తన ప్రత్యుత్తరంలో తెలిపారు.

గాయపడిన పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

పాఠశాలల్లో ఇటువంటి దురదృష్టకరమైన జోక్యం రాజకీయ పార్టీల నేతలకు, అధికారులకు ఒక హెచ్చరిక కావాలని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. “ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, బాధ్యులెవరైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.

Related posts