వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే చిత్రం పై ఇప్పటికే వివాదాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యాక… వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా టైటిల్, కథపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు ఫిర్యాదు చేశారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేలా, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సినిమా టైటిల్ ఉందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. మన దేశంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను రాజ్యాంగబద్దంగా ఎన్నుకుంటారని, కులాల పేరుతో కాదని నాగరాజు తెలిపారు. కొన్ని సామాజికవర్గాల మనోభావాలను దెబ్బతీసేలా టైటిల్ ఉందని చెప్పారు. వెంటనే సినిమా పేరును మార్చాలని డిమాండ్ చేశారు. రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.