యుగాలు దాటొచ్చిన మనిషిని
మృగాలుగా మార్చింది ఎవ్వడు ?
పాలిచ్చిన అమ్మల రొమ్ములను
బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి
ఊతమిచ్చింది ఎవ్వడు ?
వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ?
విధ్వేషాన్ని రక్తనాళాలలోకి ఎక్కించింది ఎవ్వడు ?
తల్లుల జననాంగాల మీద తాండవ మాడిన
గాడిద కొడుకులను కని పెంచింది ఎవ్వడు ?
నెత్తురుని మరిగించింది ఎవ్వడు ?
కత్తులను నూరించింది ఎవ్వడు ?
శాంతి దూత ఆలయాలను కూల్చింది ఎవ్వడు ?
ఉసురు తీసి ఉత్సవం జరిపించింది ఎవ్వడు ?
మంటలను రాజేసింది ఎవ్వడు ?
గిరిజన పంటలను కాల్చేసింది ఎవ్వడు ?
మదమెక్కి ఆడబిడ్డలపై మానభంగం చేసిన
మతోన్మాద మూకలకు నూకలు ఇస్తున్నది ఎవ్వడు ?
పాకలు వేసి “భక్షణ శిక్షణ” అందిస్తున్నది ఎవ్వడు ?
ఎవ్వడురా విషాన్ని విరజిమ్ముతున్నది ?
ద్వేషాన్ని దేశంపై వెదజల్లుతున్నది ?
మతాన్ని మంటలకు ఇంధనం చేస్తున్నది ?
పచ్చని గసగసాల పైరు కొండల
మణిపూర్ కన్నుల కుండల నిండా
సల సల మరిగే వెచ్చిని నీరును నింపుతున్నది ?
వాడు! వాడెవడంటే!!
ఛాందస పీఠంపై పీటలు వేసుకొని
మౌడ్య సిరా చుక్కలను మౌన కలంలోకి ఒంపుకొని
రణ మరణ శాసనాలు లిఖిస్తున్నాడు.
మన జీవన గమనాలను శాసిస్తున్నాడు.
అయితే !
ఇప్పుడు వాడు అనుకుంటున్నట్టు !!
మణిపూర్ నడి వీధుల్లో
నగ్నంగా నడిచింది దేహం కాదు
“అది దేశం”.
పాశవిక అత్యాచారం జరిగింది
మానం మీద కాదు
“వాడి మౌనం మీద”
( వాడి మౌనం ఎంత ప్రమాదమో మన మౌనం అంతకంటే ప్రమాదం మిత్రులారా )
మణిపూర్ మారణకాండను , భరతమాతలపై జరిగిన పైశాచిక అత్యాచార దాడులను తీవ్రంగా ఖండిద్దాం. ఉన్మాద రాజకీయాలను , వాటి సైద్ధాంతిక భావజాలాన్ని తిప్పికొడదాం.
బూజిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి.