telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సాంకేతిక సామాజిక

వీడియో కాల్ తో .. విడాకులు…

whatsapp services to old models is stoped

రోజుకో టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది, అలాగే దానిని వినియోగించుకునేవారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతూ వస్తుంది. అయితే ఆయా టెక్నాలిజీని విచిత్రంగా, ఎవరు అనుకోని విధంగా ఉపయోగించుకునే వారిని చూస్తే.. అసలు వారికి ఆ ఆలోచన ఎలా వచ్చిందా.. అని అనిపించక మానదు. అప్పుడెప్పుడో, ఫేస్ బుక్ పెళ్లిళ్లు అయినట్టుగా, ఇప్పుడు వాట్సాప్‌ వీడియో కాల్ సాయంతో అమెరికాలో ఉన్న భార్య, భారత్‌లో ఉన్న భర్త విడాకులు తీసుకున్నారు. ఈ అరుదైన సంఘటనకు నాగ్‌పూర్ ఫ్యామిలీ కోర్టు వేదికైంది. విద్యార్థి వీసా మీద మిచిగాన్‌లో చదువుతోన్న భార్య(35) విచారణకు హాజరు కాలేనని వెల్లడించడంతో న్యాయస్థానం ఈ కొత్త విధానాన్ని అనుసరించింది. వాట్సాప్‌ వీడియో కాల్ ద్వారా ఈ విచారణ చేపట్టాలన్న ఆమె అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో మిచిగాన్‌లో ఉద్యోగం చేసే భర్త(37) మాత్రం నాగ్‌పూర్ కోర్టు ముందు హాజరయ్యారు.

వివరాల్లోకి వెళితే..తెలంగాణలోని సికింద్రాబాద్‌లో పెద్దలు కుదిర్చిన వివాహంతో వారిద్దరు ఒక్కటయ్యారు. ఇంజనీరింగ్ పట్టభద్రులైన వారు అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలో పనిచేసేవారు. అయితే యూఎస్‌ వీసా గడవు ముగియడంతో కొంతకాలం ఆమె నాగ్‌పూర్‌లోని బంధువుల ఇంట్లో ఉన్నప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తర్వాత ఆమె విద్యార్థి వీసా మీద మిచిగాన్ వెళ్లినా.. వారి మధ్య సఖ్యత కుదరకపోగా, మరింత దూరం పెరిగింది. దాంతో భర్త నాగ్‌పూర్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. నిబంధనల ప్రకారం ఆ కేసును కౌన్సిలర్‌కు అప్పగించారు. కౌన్సిలర్‌ ఆమెను వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రశ్నించి, ఆ కాల్‌ను రికార్డు చేశారు. భార్య తరఫున ఆమె సోదరుడు హాజరయ్యాడు. తర్వాత భర్తను ప్రశ్నించగా ఇద్దరూ విడాకులకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. వారిద్దరూ ఇప్పటికే సంవత్సరం నుంచి విడిగా ఉంటున్నారని, వారికి విడాకులు మంజూరు చేయాలని ఇరు వర్గాల న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.

Related posts