ఇటీవల తృణధాన్యాల ప్రాధాన్యత అందరూ తెలుసుకుంటున్నారు. దీనితో వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోతుంది. వీటిలో సామలు, కొర్రలు, అరికెలు, ఊదలు వంటి వాటికీ డిమాండ్ బాగా పెరగడంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి గరిష్ఠ చిల్లర విక్రయ ధర(ఎమ్మార్పీ) గత ఆరునెలల్లో 50 శాతానికి పైగా పెరిగింది. రోజువారీ ఆహారంలో వరి అన్నం తినే వారు దానిని మానేసి తృణధాన్యాల వైపు మొగ్గుచూపుతున్నందున వీటి ధరలకు రెక్కలొచ్చాయి. రకాన్ని బట్టి కిలో బియ్యం ధర రూ.40 నుంచి రూ.50 దాకా ఉంది. అయినా వాటిని మానేసి కిలో కొర్రలు లేదా సామలు, ఊదలు వంటి వాటి కోసం రూ.70 నుంచి రూ.80 దాకా వెచ్చించి మరీ కొంటున్నారు.
ఆరునెలల క్రితం వీటి ధర ఇంతకన్నా 50 శాతం దాకా తక్కువ ఉండేదని మలక్‌పేట టోకు వ్యాపారులు ‘ఈనాడు’కు చెప్పారు. వీటిలో పోషక విలువలు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు తీసుకుంటున్నారు. ఏడాది క్రితం వరకు ఈ పంటలను పండిస్తే అమ్ముకోలేక, ధర లేక రైతులు నానా పాట్లు పడేవారు. ఇప్పుడు ఈ పంటలు పండించే రైతుల చిరునామాలు అడిగి మరీ కొనే వ్యాపారుల సంఖ్య పెరుగుతోందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. తొలిసారిగా ఈ పంటలను వచ్చే జూన్ నుంచి ప్రారంభమవుతున్న వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో రైతులతో పెద్దయెత్తున పండించేందుకు వ్యవసాయశాఖ కూడా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పంటల విత్తనాలకు ఏకంగా 65 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది.
ఈ పంటలకు డిమాండ్ పెరగడంతో వాటి విత్తనాల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. కొర్రల్లో రెండు రకాలున్నాయి. సాధారణ కొర్రల విత్తనాల ధర క్వింటా రూ.8,600 కాగా అందెకొర్రల ధర రూ.21,600కు చేరింది. పచ్చజొన్నల విత్తనాల ధర అధికారికంగానే క్వింటాకు రూ.15,600 అని వ్యవసాయశాఖ ప్రకటించింది. సాధారణ జొన్నల ధర ఇంతకన్నా రూ.3 వేలు తక్కువగా రూ.12,600 ఉంది. రాగుల ధర రూ.18,600కు చేరింది. కర్ణాటకలో రాగులు సహా ఇతర తృణధాన్యాల పంటలను అధికంగా పండించడంతో పాటు వాటిని మద్దతు ధరకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొంటోంది. ఇప్పుడు పలు తృణధాన్యాల విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి కొని ఇక్కడి రైతులకిచ్చి పంట సాగుచేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.