కోడెల శివరామకృష్ణకు చెందిన గౌతమ్ హీరో షోరూమ్ ఆథరైజేషన్‌ను రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్‌లో కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లో బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. 1025 బైక్‌లను టీఆర్ లేకుండా విక్రయించినట్టు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా బైక్‌లు డెలివరీ చేసిన శివరామ్ టీఆర్, లైఫ్ ట్యాక్స్, శాశ్వత రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీ, హెచ్‌ఆర్‌పీఎస్ (హైసెక్యూరిటీ) నంబర్ ప్లేట్, పోస్టల్, ఇతర ఫీజుల కింద ఒక్కో బైక్‌కు సగటున రూ.8 వేల చొప్పున వసూలు చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా కోడెల శివరామ్ నొక్కేశారు.
రవాణా శాఖ అధికారుల విచారణలో ఈ విషయాన్ని బైక్‌ల యజమానులు తెలిపారు. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ లేకుండా బైక్‌ల విక్రయాలు చేసి ప్రభుత్వానికి రూ.లక్షల్లో గండి కొట్టిన శివరామ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రవాణా శాఖ అధికారులు గౌతమ్ షోరూమ్‌ను సీజ్ చేయడంతో శివరామ్ కోర్టును ఆశ్రయించాడు. 576 వాహనాలను మాత్రమే టీఆర్ లేకుండా విక్రయించామని కోర్టు ముందు ఒప్పుకున్నాడు. ఈ బైక్‌ల విక్రయాలకు సంబంధించి ఎగ్గొట్టిన మొత్తాన్ని చెల్లిస్తానని శివరామ్ తెలియజేశాడు. 576 బైక్‌లకు సంబంధించి 40.26 లక్షలు ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన మొత్తాన్ని శివరామ్ ఎగ్గొట్టినట్టు రవాణా శాఖ అధికారులు నిర్ధారించారు.
బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు