telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రధానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ లేఖ.. అందులో ఏముందంటే ?

Puri

పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో రామ్, న‌భా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “ఇస్మార్ట్ శంక‌ర్”. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ చిత్రం పూరీకి మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు పూరీ మోడీకి రాసిన లేఖపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, భారత్‌ను ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించినంతమాత్రాన పర్యావరణం బాగుపడదని, అందుకోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సూచించారు. ఈ మేరకు ప్రధానిని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాసి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. “ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య వాతావరణ మార్పు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాతావరణ మార్పునకు ప్లాస్టిక్ వాడకం కూడా ఒక కారణం. అయితే అదొక్కటే కారణం కాదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించినందువల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. 1960వ దశకంలో ప్లాస్టిక్ వాడకం బాగా పెరగడం వల్ల కాగితపు సంచుల వాడకం తగ్గి.. చెట్లు, అడవులను కొట్టేయడం తగ్గింది. మళ్లీ ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధించి కాగితపు బ్యాగ్‌లు వాడడం మొదలుపెడితే చెట్లను, అడవులను నరకాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. ప్లాస్టిక్‌ను ఒక్కసారి వాడిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్లే అవి పర్యావరణానికి హానికరంగా మారుతున్నాయి. అందుకే ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌నే మళ్లీ మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్లాస్టిక్ రీ-సైక్లింగ్ యూనిట్‌లను నెలకొల్పాలి. ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌ను తీసుకొస్తే డబ్బులిస్తామని ప్రకటించాలి. అప్పుడు ప్రజలే ఆ యూనిట్లకు తాము వాడేసిన ప్లాస్టిక్ కవర్లను తీసుకొస్తారు. ఇలాంటి మరిన్ని చర్యలు చేపట్టినట్టైతే ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు” అని పూరీ ఆ లేఖలో పేర్కొన్నారు.

Related posts