ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ ఈ మధ్య కాలంలో మోసాలు బాగా జరుగుతున్నాయి. వీటిని నమ్మి కొందరు ఘోరంగా మోసపోతున్నారు. నిజం తెలిసాక నివ్వరపోతున్నారు. మాములు ఎమ్మెల్యే, చిన్న స్థాయి నాయకుల పేర్లు చెప్పి మోసం చేస్తే..అది సాధారణమే కానీ ఏకంగా సీఎం కేసీఆర్ పేరు వాడుకున్నాడు ఓ యువకుడు. సీఎం కేసీఆర్ గన్‌మెన్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న పేక్ పోలీసును అరెస్ట్ చేశారు వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్ కి చెందిన నందికొండ సంతోష్ అనే వ్యక్తి ఫేక్ ఐడీ కార్డుతో కొన్ని రోజులుగా ఎస్సైగా చలామణి అవుతున్నాడు. ప్రస్తుతం తాను సీఎం కేసీఆర్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ నిరుద్యోగ యువత దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో సంతోష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి నకిలీ తుపాకీ, ఫేక్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సంతోష్ ఎస్సైగా పనిచేస్తున్నానని చెప్పి ఓ యువతితో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.