telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కల్వకుంట్ల కవిత ప్రారంభించిన నిత్యాన్నదానానికి మూడేళ్ళు..

అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అనే మాటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడుతూ, లక్షలాది మంది అన్నార్తుల కడుపు నింపుతున్నారు ఎమ్మెల్సీ కవిత. మానవత్వమే ఊపిరిగా, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. లక్షలాది మంది ఆకలి తీర్చేందుకు, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఉచిత అన్నదాన కేంద్రం రేపటికి(ఆదివారం, నవంబర్ 8) మూడు వసంతాలు పూర్తి చేసుకోనుంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కవిత సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రం ప్రతిరోజు దాదాపు 750 మంది అన్నార్తుల ఆకలి తీర్చుతోంది.

ఆ ఒక్క పర్యటన…

లోక్ సభ సభ్యురాలిగా ఉన్నప్పుడు ఓ రోజు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన కవిత గారికి, తిండి కోసం రోగుల బంధువులు పడుతున్న కష్టాలను చూసి చలించారు. ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది నిరుపేదలే కావడం, కొందరికి ఒక్కపూట కడుపు నింపుకోవడానికి కూడా ఆర్థిక స్థోమత లేదని తెలుసుకుని చలించిపోయారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఉచితంగా భోజనం అందిచాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. పేదల ఆకలి తీర్చేందుకు సొంత డబ్బులతో, 2017 నవంబర్ 8 నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ ఆసుపత్రిలో ప్రతి రోజు మధ్యాహ్నం దాదాపు 750 మంది నిరుపేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నది. అన్నదాన కేంద్రాలను పలుమార్లు సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రోగుల బంధువులు, సహాయకులకు స్వయంగా భోజనం వడ్డించారు. వీటితో పాటు అనంతరం 2018 ఏప్రిల్ 26న బోధన్, 2018 జులై 5 నుంచి ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల్లో నిత్యాన్నదానం ఏర్పాటుచేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ అన్నదాన కేంద్రాల్లో పనిచేసే వాలంటీర్లు గర్భిణీలు, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రోగుల దగ్గరకు వెళ్లి స్వయంగా వడ్డిస్తున్నారు. కవిత గారు నిర్వహిస్తున్న అన్నదానం ప్రభుత్వాసుపత్రులకే పరిమితం కాలేదు. ఆకలి బాధ తెలియకుండా పేద విద్యార్థులు శ్రద్దగా చదువుకోవాలన్న ఆలోచనతో జిల్లా గ్రంథాలయం దగ్గర కూడా 2018 జులై 15 అన్నదానం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అన్ని అన్నదాన కేంద్రాల్లో, ప్రతి రోజు దాదాపు 1500 మంది పేదలకు ఉచిత భోజనం అందిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో…మరిన్ని అన్నదాన కేంద్రాలు

కరోనా వైరస్ ప్రభావం వల్ల మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో అన్ని ప్రాంతాల్లో హోటళ్లు, భోజనశాలు మూతపడి ఉన్నాయి. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న అనేక మంది రోగుల సహాయకులకు మాత్రమే కాకుండా వందలాది మంది పేద ప్రజలకు, వలస కూలీలకు భోజన కష్టాలు మొదలయ్యాయి. దీంతో లాక్ డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు గాను, ఏప్రిల్ లో మరో మూడు అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

ఇందులో భాగంగా నిజామాబాద్ పట్టణంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల కోసం ఒక అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ప్రతి రోజు దాదాపు 2500 భోజనం ప్యాకెట్ లను పంపిణీ చేసారు. జగిత్యాల, మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరో రెండు అన్నదాన కేంద్రాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేశారు. అంతేకాదు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కోసం మరో అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఏడు లక్షల మందికి పైగా కడుపు నింపిన అన్నదాన కేంద్రాలు…

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించిన అన్నదాన కేంద్రాల ద్వారా ప్రతిరోజు వేలాది మంది నిరుపేదలు, అన్నార్తుల ఆకలి తీరుతోంది. ఈ అన్నదాన కేంద్రాల్లలో భోజనం ఉచితంగా మాత్రమే కాదు, నాణ్యతో కూడిన ఆహారం అందిస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, గత మూడు సంవత్సరాలుగా లక్షలాది మంది నిరుపేదలకు ఉచితంగా భోజనం అందిస్తుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Related posts